ఉజ్జయినిలోనున్న ఓ మహాకాళా…

ఉజ్జయినిలోనున్న ఓ మహాకాళా…
నన్ను సజ్జనుని చేయుమయా శ్రీ మహాకాళా…
శిప్రా  నదీ తీరాన కొలువైన దేవా…
నీకు శిరసాభివందనములు ఓ మహాదేవా…
ఆవరించీ ఉన్నావు అణువణువునా నీవు…
విస్తరించీ ఉన్నావు విశ్వవ్యాప్తముగ నీవు…!!ఉజ్జయిని!!

ఆ చెట్టులో కలవు…ఈ గుట్టలో కలవు…
ఆ కొండలో కలవు…ఈ కోనలో కలవు…
కర్షకులు పండించు పంటలో కలవు…. కార్మికులు చిందించు స్వేదమున కలవు..
కలవయ్య కలవయ్య కాత్యాయని పతీ….
కనరాని చోటు నీదేముంది గౌరీపతి…!! ఉజ్జయిని!!

చిరుగాలిలో కలవు…సెలయేటిలో కలవు…
చంటి పాపలో కలవు…తల్లిపాలలో కలవు…
గలగల పారేటి గోదారిలో కలవు… కిలకిలా నవ్వేటి కృష్ణమ్మలో కలవు….
కలవయ్య కలవయ్య కాత్యాయనీ పతీ…
కనరాని చోటు నీదేముంది గౌరీపతి…!! ఉజ్జయిని!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top