ఎదుగుచున్ననూ నేను వయసులో…
ఇంకనూ ఎదగ కుంటిని నేను భక్తిలో…
తలచుచున్ననూ నిన్ను ప్రతి క్షణములో….
శంకరా..పొందనైతిని చోటు నీ మనసులో….
శివ… తప్పుకాచి నన్ను మన్నించరా…
హరా…నీ దృష్టిలో నన్ను పడనివ్వరా…!! ఎదు!!
భక్తజన సమూహమున నేనుంటిరా…
భుజముపై బిల్వదళములు మోసుకొస్తుంటిరా…
కోట్ల గొంతులతో గొంతు కలిపానురా…
శివా… “శంభోహరా” అని నిన్ను పిలిచానురా….
వినిపించ లేదేమో నా పిలుపులు…
అందుకే పడలేదు నా పైన నీ చూపులు…!! ఎదు!!
శంకరా… హృదయము ద్రవించుచున్నది కానవయ్యా…
ఈశ్వరా.. మానసము కన్నీరు ఒలికించుచున్నది చూడవయ్యా…
చేయదట తప్పు ఇక ఏ జన్మలో…
తాను మరువదట నీ స్మరణ ఏ క్షణములో…
ఉపేక్షించక వరమివ్వు ఉజ్జయిని కాళా….
ఇక నిరీక్షించగ లేనయ్య శ్రీ మహాకాళా…!! ఎదు!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమామ్…