మహిమో..మహత్యమో  

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

మహిమో..మహత్యమో  
ఎరుగనైతిమి శ్రీ మహాకాళేశ్వరా…
నీదన్నదే ఏమి లేదురా నీకంటూ…
నీలోన వుంది నీది కాదురా నువ్వంటూ…
ఆక్రమించావు నాలోన అణుణువునా అర్ధనారీశ్వరా..!!మహిమో!!

మురిసి పోయాను పదిమందితో కలిసి పంచుకొని నీ లీలా విశేషములను..
నే..నెవరన్నదే మరచిపోయాను తన్మయత్వముతో తడిసి వెల్లడిస్తూ భక్తి భావోద్రేకములను…
ఆ క్షణములో ఉప్పొంగే ఆనంద జలసిరులు నాకళ్ల వెంట..
క్షణమైన నిను వీడని గంగనే రప్పించి నా కనులలో ఋజువు చేశావు కదా ఓ నీలకంఠా..!!మహిమో!!

కనుగొనగలమేమో గాని కడలి లోతెంతనో…
కనుగొనలేమయా శంకరా..నీ హృదయ వైశాల్యమెంతనో…
రెక్కలు ముక్కలుగా చేసుకొని వేటాడితేగాని దొరకనే దొరకవు సంద్రాన సంపదలు…
“శివశంకరా మనసాస్మరామి” అంటేనే చాలు మాకు ఇస్తావు సుగుణాలతో బాటు సిరులు,సంపదలు…
మేము చేసిన పుణ్యమెంతయో గానీ..
ఈ ధరణి నోచిన నోము ఏనాటిదో గానీ..
కోటాను కోట్ల గుడులలో వెలిశి వున్నావు శంకరా…
మా నవనాడులలో మాతోటి నిండిఉన్నావు హరహరా…

పాహిమామ్..పాహిమామ్..శంకరా..
సదా నీ నామమునే పలుకు వరమియ్యరా హర హరా…

Leave a Comment

Scroll to Top