కొలవవే మనసా…మనసార శివునినిప్పుడైనా…

ఓం నమః శివాయ నమః 

కొలవవే మనసా…మనసార శివునినిప్పుడైనా…
హరుని తలవవే మనసా…భక్తితో ఈ క్షణమునైనా…
తక్షణము పొందేవు సాంత్వనమును…
ప్రతి క్షణము కనగలవు శివుని కరుణ రస హృదయ తీరములను…!! కొలవ!!

ప్రశ్నించుకో నిన్ను నీవే ఘడియ కొకసారి…
అసలు చేస్తున్నదేమిటో, చెబుతున్నదేమిటో తర్కించుకో రోజుకొకసారి…
పొంతనే లేకుండ సాగేను నీ పయనము…
తుదకు చింతనలు మిగిలిస్తూ గడచేను నీ గమనము…
తెరవవే మనసా.. ఇకనైన కనులను..
తప్పులను మన్నించమని కోరవే పట్టుకొని పరమేశ్వరుని పాదములను….!! కొలవ!!

చేయవే మనసా…పద పంచామృతాభిషేకములు పరమేశ్వరునికి….
సుభక్తితో పాడవే మనసా…సుమధుర సంకీర్తనలు సర్వేశ్వరునికి….
అతీంద్రియ శక్తులను అడగనంటూ ..
పంచేంద్రియముల మీద పట్టు నివ్వమంటూ…
కోరవే మనసా….కరుణించు శివుడు..
మనసార వేడుకొనవే మనసా ..నీకు ముక్తినొసగును హరుడు..!! కొలవ!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం.
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top