ఏలనయా శంకరా…ఈ భయానక రూపము…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఏలనయా శంకరా…ఈ భయానక రూపము…
చూపకయా హర హరా…ఉద్రిక్త కోప ప్రతాపము…
మది తాళగలదా చూసి ఈ ఉద్విగ్న రూప దృశ్యము…
మన్నించి విరమించవయా ఈ రూపమవశ్యము…!!ఏ!!

నిలుచుండలేమయా నిటలాక్షా నీ ఎదుటనే…
నిప్పుకణికల కళ్ళతో చూస్తుంటే నిన్నలా….
కదిలెళ్ళలేమయా కరుణాకరా..
కోపాగ్నితో రగులుతున్నట్లుంటే నువ్వలా…
మాలోని దుర్గుణములను దహియించుటట్లైతే స్వాగతించేము…
తెలిసి తెలియక చేసిన తప్పులున్నట్లైతే మన్నించకోరేము…
నవరంధ్రాలు కల నరజన్మరా శంకరా…
రంధ్రాన్వేషణ చేసి శిక్షించ బోకురా హర హరా…!!ఏ!!

నీ కరుణతోన బ్రతుకుతున్న జీవులం…
విధి ఆడు నాటకాన వింత  బొమ్మలం…
భవ బంధాల సాగరమునుండి బయటపడలేని చేపలం…
కోర్కెల జాలరి వలకు చిక్కనివ్వకని వేడుతున్న ప్రాణులం…
అలసిపోయి సొలసిపోయి రాలిపోతే ఆ సాగర గర్భాన..
ఆల్చిప్పనై జన్మించు వరమివ్వరా మేలి ముత్యమై చేర నీ సతి పార్వతి మెడలోన….

పాహిమామ్..పాహిమామ్..శివశంకరా...పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..

Leave a Comment

Scroll to Top