ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఉజ్జయిని పురవాస..శ్రీ కాళలింగేశా
కైలాసవాసా శ్రీ ఉమా మహేశా
కలిగించరా శంకరా నీ పైన ధ్యాస
ఏనాటికైనా కరుణించెదవని ఈ ప్రాణికొక చిన్న ఆశ..!!ఉజ్జ!!
దైవికముగ ఏర్పడిన ఈ బంధమేనాటిదో…
ఆకస్మికముగ ముడిపడిన ఈ అనుబంధము ఎన్నాళ్ళదో..
నీ ఆరాధనా ఊసులే నా శ్వాసలై
ఆ భావనా ప్రపంచమే నా లోకమై
బ్రతికేను శంకరా భవబంధభారములను మరచి…
తొంగి చూసేను శంకరా.. సంపూర్ణ భక్తి ప్రపత్తులతో నీ మనసు తెరచి!!,,ఉజ్జ!!
పాపపంకిలమైన దేహమును మోసుకొని వచ్చాము…
అపవిత్రము కారాదని నీ సన్నిధి… గో పంచితము చల్లుకొని వచ్చాము…
నీ ఎదుట నిలవగనే ఉప్పొంగె గుండెనిండా భక్తి భావనలు…
ఓం నమశ్శివాయ అనగనే కలిగె ఒడలంతా పుణ్య ప్రకంపనలు…
మన్నించరా శంకరా మాలిన్యము కల మనసులని మరచి…
దీవించరా హర హరా..కైవల్యపదమిత్తునని మా భుజము చరచి…!!ఉజ్జ!!
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..సకల శోభాయమాన సర్వేశ్వరా రక్షమాం..