ఓమ్ నమ:శ్శివాయ నమ:


బ్రహ్మ ముహూర్తము వేళ ప్రతి దినము కాళేశ్వరా నీకు భస్మాభిషేకముల హేల…
దర్శించుకొనిన భక్తజనుల కనుల ఉదయించును రా ఈశ్వరా నీ కరుణాల వెన్నెల…
సాంత్వన పొందేరయా శివశంకరా నిను కొలిచి….
బాధలు పూర్తిగా మరిచేరయా భవహరా నిను తలచి !!బ్రహ్మ!!
వేచి ఉంటారు భక్తులు ఎందరెందరో నీ భస్మాభిషేకమును దర్శించుట కొరకు…
కాచుకొని కూర్చొని ఉంటారు ఆత్రముగా ఒక్కొక్క క్షణముని లెక్కపెడుతూ ఆ దివ్యానుభూతి పొందు వేళ కొరకు…
మా కనుల ముందే జరుగుతుంటే అంగరంగ వైభవముగ నీకు భస్మాభిషేకము…
సడి చేయని మా కనురెప్పలు చేసేనయా క్షణమైన ఆగక నీ నామ స్మరణాభిషేకము…!!బ్రహ్మ!!
భస్మాభిషేకానంతర నీ దివ్యదర్శన అలంకార మంగళ హరతులు కనగా ..
పూజాగ్రేసరులు నిష్టతో శ్రావ్యముగ నిను స్తుతియించు మంత్ర స్వరములు వినగా..
నిలువెల్ల ఈ తనువు నీ మయమయి పోయాక..
నీ సేవలో నిలువునా మునిగి పోయాక..
మరుజన్మ ఎందుకని ఉదయించెరా బదులెరుగని ఓ ప్రశ్న మాలోన…
సంకోచించక మరుజన్మ లేకుండ వరమియ్యరా ఓ శుభ తరుణాన…
పాహిమామ్..పాహిమామ్..శివశంకరా.. పాహిమామ్..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్..