కదిలితే చాలయా శంకరా…నీ కనుసోయగాలు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

కదిలితే చాలయా శంకరా…నీ కనుసోయగాలు…
తరలిరావా..జయము జయమయా శంకరా అంటూ ముజ్జెగాలు…
వినమ్రతతో నీ ఆనతిని వినడానికై..
విధేయులై నీ కాల చక్రాన నడిచేందుకై…!!కదిలితే!!

కాలాన్ని శాసించునట్లుండు నీ కంటికనుపాపలు…
ఈ సృష్టి సౌందర్యాన్ని పరిరక్షించినట్లుండు పగలు రేయనక నీ చూపులు…
బడలికన్నదే లేక లోకాన్ని పర్యవేక్షించుచూ…
నీ దివ్యదర్శనము నివ్వంగ గుడిలోన మా కొరకు నిరీక్షించుచూ…
చూడలేకున్నామయా శివా మా కొరకు పడుతున్న నీ కష్టము..
నీకు ఏమిస్తే తీరునో మా ఋణము చెప్పయ్య శంకరా తీర్చేము ఏదైన నీఇష్టము….!!కదిలితే!!

ఎంత వరమొందెనో శంకరా నీసతి అవగ శాంకరీ…
దయాగుణసంపన్న మల్లన్నని పెనిమిటిగ చేసుకొన్న మా కల్పవల్లి భ్రామరీ…
ఆదిదంపతులై భువిని జనరంజకముగ పాలించుచుండగా..
అభయమూర్తులై కనువిందుగా కనిపించు చుండగా…
ఏ వరమని మిమ్ము మేమడగలము..
మీ “కలవరమే” వరముగ మాకిమ్మని కోరగలము…!!కదిలితే!!

పాహిమాం… పాహిమాం.. శివ శంకరా పాహిమామ్…
రక్షమామ్..రక్షమాం..అభయంకరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top