శివా…చెప్పవా నీతోడుగుంటాననీ…

శివా…చెప్పవా నీతోడుగుంటాననీ…
హరా..పలుకవా నీ హితుడ నేనేనని….
అలా తెలిపితే మా జన్మ ధన్యమయ్యా….
నువ్వలా మౌనమును వహిస్తే మా బ్రతుకు వ్యర్థమయ్యా…
అందుకో ఈ పూల హారాలను…
చూపించవా మా స్థితికి పరిహారములను…!!శివా!!

నిదురోయినా మా కొచ్చు కష్టాల కలలు…
నిదురోయి లేచినా కనలేము బంగారు కలలు…
ఎదురీదినా పోకుండె ప్రారబ్ద కర్మలు….
ఎంత ప్రార్ధించినా రాకుండె నీ నుండి పిలుపులు…
గంపెడాశ తో ఉన్నాము గంగాధరా…
దీనులను కరుణించగలవని నీవు దీనోద్ధరా…!!శివా!!

నీ పుణ్య క్షేత్రాలు పన్నెండు తిరిగినా….
నీ దివ్య మంత్రాలు పలుమార్లు పలికినా…
నీ కరుణ లేనిదే జరుగునా జీవనం…
నీ ఆజ్ఞ లేనిదే దొరకునా భోజనం…
కొన ఊపిరితో ఉన్నాము నీ కరుణకు….
నీవు స్పందించకుంటె ఎట్లయ్యా మా పిలుపుకు….!!శివా!!

పాహిమాం..పాహిమాం…పార్వతీశా పాహిమాం….రక్ష మాం..రక్షమాం.. శాంకరీశా రక్షమాం…

Leave a Comment

Scroll to Top