భూరీ వరాలనిచ్చు భుజంగ భూషణా…

భూరీ వరాలనిచ్చు భుజంగ భూషణా…
భారీ శుభాలనిచ్చు భ్రామరీ ప్రేరణా…
నిత్యమూ ఈ జగము నిను కొలుచు చున్నది…
ప్రతి ఉదయమూ దర్శించి తరియించు చున్నదీ…
శాంకరీ మానసా…అందుకో పూజలు ..
ఉమా సతీ ప్రేమికా…చేయించుకో సేవలు…!!భూరీ!!

ఆశా పాశములను మట్టు పెట్టేము…
రాగ బంధాలనిక చుట్టి పెట్టేము…
కోరికల గుఱ్ఱాలకు కళ్లెం వేసేము…
స్వార్థమను విష గుళికలను పాతి పెట్టేము…
ఏ కల్మషము ఎరుగని పసి పాప నవ్వుమల్లె…
భక్తితో ప్రార్ధించెదను శంకరా…భక్త కన్నప్ప వోలె…!!భూరీ!!

వర వితరణ శీలివి నీవు విశ్వేశ్వర…
సుగుణ గుణ ప్రదాతవు నీవు సర్వేశ్వరా…
అచంచలమైన భక్తి ప్రపత్తులు నీవు నా కొసగితే…
అమోఘమైన సేవలను నీవు నా నుంచి పొందితే…
ఆనంద భాష్పాల గంగ కారదా నా కనుల జల జలా…
శంకరా…నీ కరుణతో మెరయదా ఈ జన్మ మిలమిలా…!!భూరీ!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top