ఆహా… ఏమి ఆ శివుని సౌందర్యము..
కనిన మనసులకది కదా కడు సంబరం…
రాదా…ప్రతి ఒకరికీ తన పుణ్య ఫలము…
హరుని గాంచిన పిదప తొలగి కర్మ ఫలము…
జేజేలు కొట్టరే జంగమునికి…
జయ జయధ్వానాలు పలుకరే శంకరునికి…!!ఆహా!!
వేల విరిమాలలతో ఫాల నేత్రుండు…
లక్ష రుద్రాక్ష దండలతో రుద్ర నేత్రుండు…
అరుదెంచినట్లుండె ఆది శంకరుడు…
కైలాస గిరిలొదిలొచ్చినట్లుండె సాంబ శివుడు…
దివి నుండి దేవతలు దిగివచ్చి శివుని దర్శించులోగా…
మనమెళ్లి చేసేదము పూజలను సురులు నిశ్చేష్టులవగా….!!ఆహా!!
పుడమంటే శంభునికి అనురాగము…
ఈ పుడమిపై జీవరాశులతో కలదు ఈశునికి అనుబంధము…
ఏ ప్రాణికి ఏ కష్టము ఎటు నుండి వచ్చినా…
ఏ ఆపద ఎటు నుండి తరుముకొని వచ్చినా…
సృష్టించితే చాలు శివుని నామ ప్రకంపనల తుఫానుని…
అవి హరుని హృదయ స్పందనల హోరుగా మారి రక్షించు ప్రతి జన్మని…!!ఆహా!!
పాహిమాం …పాహిమాం…పార్వతీ హృదయేశ్వరా …పాహిమాం…రక్ష మాం…రక్ష మాం…శాంకరీ మది నివాస రక్ష మాం…