ఎన్ని కనులు, ఎన్నెన్ని కనులు నిను కాన వేచేను శంకరా…

ఓం నమః శివాయ నమః 


ఎన్ని కనులు, ఎన్నెన్ని కనులు నిను కాన వేచేను శంకరా…
వేల తనువులు,వేవేల మనసులు నిను కొలువ గుడి ముందు నిలిచేనురా….
నిను గాంచి ధన్యతను పొందాలని…
నీ చరణాలు తాకి కృతజ్ఞతలు తెలపాలని…!!ఎన్ని!!

అడగమయా…శంకరా ..ఏ సిరులు సంపదలు….
ముప్పూటలా పచ్చగా గడచిపోతే చాలు మా జీవితాలు…
కోరమయా హర హరా…ఎన్నెన్నో వరములు…
నిను స్మరియించుచున్నపుడు తొలగిపోతే చాలు మా గత జన్మ పాపాలు…
పుట్టాలని లేదు మనిషినై మరల మరలా ఈ పుడమిపై……
తప్పదనిపిస్తే విరియాలని వుంది ఈ భూమిపై ఎన్నిసార్లయినా నీ పద పూజ పువ్వునై….!!ఎన్ని!!

నిస్వార్థ సేవలో నిష్ణాతుడనగు శక్తి నివ్వవయ్యా..
నీ ప్రత్యక్ష రూపమును మనసులో నింపుకొన వరము నియ్యవయ్య…
ఈ దేహమును నీ ఆలయముగ చేయుమయ్య…
మా హృదయము అనుక్షణము నిను కొలుచునయ్య…
జన్మ ఆసాంతమూ నీ లోకమే మా లోకమవనీ…
ప్రతి క్షణము నీ తోనే మా మనసు మమేకమవనీ….!!ఎన్ని!!

పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top