అలుపురాదేమో శంకరా..నీ కనులకు…

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

అలుపురాదేమో శంకరా..నీ కనులకు…
వీక్షిస్తూనే వుంటాయి మమ్ము మలి ఝాము వరకూ…
సొలసిపోదేమో నీ హస్తము…
అభయమిస్తూనే వుంటుంది ఆసాంతము…
ఎన్నాళ్ళిలా, ఎన్నేళ్ళిలా వేచి చూస్తుంటావు మా కోసము…
ఒక్కపూటైనా సేద తీర రావయ్య..తెరచిఉంచాము మాహృదయమందిరము నీ కోసము!!అలుపు!!

ఎదురుచూస్తుంటావు రండిరండంటూ వింటాను మీ వెతలనని..
కలయచూస్తుంటావు రాలేకపోయిన భక్తులు ఎవరెవరనీ..
చెంతకొచ్చిన వారిని దీవించి పంపుతూఉంటావు…
నీచింతనే లోకమైనోళ్ళ చెంతకి ఏదో ఒక రూపాన చేరి దయచూపుతుంటావు…
నిత్యమూ జరిగేటి తంతేకదా ఇది..
దీనజనబాంధవా…నీ కరుణ కిరణాల కాంతే కదా ఇది…!!అలుపు!!

మౌనంగ వింటావు మా ప్రార్ధనలని… పరిశీలిస్తుంటావు మా భక్తి శ్రద్ధలనీ..
నిలకడలేని మనసులు మావి మన్నించవయ్యా…
మనుగడకై పోరాడే ప్రతి నిముషమూ మము దీవించవయ్యా…
ఊహించనటువంటి ఉత్తమ మార్గాలలో పయనించునటుల..
లోకోత్తరమైన నీ సేవలలో పరిపూర్ణులమవునటుల…!!అలుపు!!

పాహిమామ్..పాహిమాం.. పరమేశ్వరా పాహిమామ్..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top