ఉత్పన్నమై గోచరిస్తోంది…ఏదో భావోద్రేకము నీ మోములో..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

ఉత్పన్నమై గోచరిస్తోంది…ఏదో భావోద్రేకము నీ మోములో..
నర్మగర్భంగ దాగుంది ప్రేమ ఉద్వేగము నీ కళ్ళలో…
చెప్పరా..శంకరా…మా హృదయ వేదనలు నివేదించినందుకా…
శలవియ్యరా గంగాధరా…మా దీన గాధలు వినిపించినందుకా…
దిక్కు నీవనే…నీకు వివరించినామయ్య…
నీ మనసు గాయపరచివుంటే మన్నించవయ్య…!!ఉత్పన్న!!

దర్శించుకొనగానే చెప్పుకోవాలనిపిస్తాయి బాధలన్నీ…
నిన్ను తిలకించగానే ఒక్కొక్కటిగా కరిగిపోతాయి కొర్కెలన్నీ…
తుదకు నీ రూపమే మా మదిలోన నిలుపుకొని…
ఇంతకన్నా వరమేమి మాకింక వలదనుకొని…
అడుగులేస్తాము..ఆనందముగా గుడి బయటకి…
వెలికి రాకుండ నీ రూపము..తాళమేస్తాము భక్తితో మా గుండె తలుపులకి…!!ఉత్ప!!

ఆరాధనా యాగములో ఇది కూడా ఒక భాగమనుకొనుము తండ్రీ..
నివేదనా ప్రక్రియల పరంపరలలో మా వినతికి సముచిత స్థానము కల్పించుము తండ్రీ…
ఎదుట నిలిచి వేడుకుంటున్నాము శంకరా…
ఏమరుపాటునైన మము మరువబోకుము హర హరా.. !!ఉత్ప!!

పాహిమాం..పాహిమామ్…పరమేశ్వరా...పాహిమాం…
రక్షమాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం..

Leave a Comment

Scroll to Top