ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఇప్పుడే తెలిసింది శంకరా…నిను దర్శించినాక…
అది నిజమని తెలిసింది హర హరా…నీ ఎదుట నిలిచాక…
మాటరాని క్షణము ఒకటి వుంటుందనీ….
నిశ్చేష్టులవు నిముషము ఒకటి వస్తుందనీ…
ఆ క్షణము ఇదే ఇదేననీ…
ఆ నిముషమొకటి ఇదేననీ…!!ఇప్పుడే!!
తట్టుకోగలదా శంకరా ఈ తనువు నిన్నింత అద్భుత రూపములో తిలకించి….
మదినాపగలదా నీ సౌందర్యము.. ఉప్పొంగు భక్తిరస స్వరధారల ఝరి నుంచి…
మాకంట ఉబికొచ్చు పవిత్ర ప్రార్ధనల జలధారలను చూడవయ్యా…
తమ జన్మధన్యమని పులకించి చేస్తున్న నయనాల నాట్యాలు కానవయ్య…
ఓం…శివం..సుందరం…
హర ఓం..శివం.. శంకరం..!!ఇప్పుడే!!
ఆకాశమంత మనసు నీకుందనీ…
నీల వర్ణాన్ని పులుముకున్నావా?
వినీలాకశమే నీ ప్రేమ హద్దనీ…
ఆ వర్ణ రూపాన అరుదెంచినావా…
నీ చల్లనీ నీడలో నివసించమని
నీలి మేఘాల్ని నింపుకున్నావా..
భక్తి భావనలు మాలోన మరింతగా పెంచుటకై…
ముక్తి దారులను మాకింతగా చూపించుటకై..
అలుపెరుగక అనుదినము మము తరింప ఎన్నెన్నో రూపములతో సాక్షాత్కరించి ప్రయత్నములు చేసెదవయా నీవు…
రత్నఖచిత మణి మాణిక్యములు పొదిగిన స్వర్ణాభరణములు ఎన్ని సమర్పించినా నీ ఋణము తీర్చగా అవి చాలవు…
పాహిమాం..పాహిమామ్..శివశంకరా..
నీ పదసేవలో తరియించు వరమియ్యరా రక్షమామ్…