మారేడు దళమా…మారేడు దళమా…
శివునికి ఎటులిష్టమైతివో కాస్తంత తెలుపుమా…
ఏ పూజ చేస్తివో…ఏ వ్రతము చేస్తివో…
వివరముగ వివరించు శంకరుని ప్రియతమా….
చేసేను నేనునూ ఆ పూజలు…
ఆచరించేను ఎన్నైన ఆ వ్రతములు…!!మా!!
శివుడు మనిషిలా పుట్టించె నన్నెందుకో….
నన్ను నీలాగ పుట్టించ లేదెందుకో….
హరుడు అంతలా కరుణించె నిన్నెందుకో…
నన్ను నీలాగ బ్రతికించ లేదెందుకో…
ఏ పాప ఫలమో నేను మనిషినై పుడితినే…
నీది ఏ పూర్వ పుణ్యమో నీవు బిల్వమై పుడితివే…!!మా!!
బిల్వమా…బిల్వమా అడగవే ఇపుడైన శంకరుని చేరి…
నన్ను పుట్టించమని నీలాగ ఈ జన్మ తదుపరి….
తెలుపుమా తెలుపుమా నా మనవి తనకి….
తాను వరమిస్తె చాలు ఈ జన్మ చాలించు సరికి…
చేసేను ఎన్నైన తన పూజలు…
నిర్వహించేను ఎన్నైన తన వ్రతములు…
ఋణపడుతునే నీకు మారేడు దళమా….
నీకు కృతజ్ఞుడుగా ఉందునే ఓ బిల్వదళమా….!!మా!!
పాహిమాం…పాహిమాం..పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం…రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం…