ఓమ్ నమ:శ్శివాయ నమ:


నిప్పు కణములాయె నిటలాక్షుని కనులు ఏలమ్మ పార్వతీ….
గుండె నిబ్బరముగ నుండునా మాకు హరుని దర్శించి చెప్పమ్మ శంకరుని ప్రియసతి…
దండకములు చదివేము దాక్షాయిణీ పతికి….
కీర్తనలు పాడేము గిరిపుత్రి పతికి…
ఉపసంహరించుకొనమని చెప్పమ్మ ఉగ్రరూపమును ఉమాపతిని….
కనిమనలేరని చెప్పమ్మ ఇవ్విధముగ భువి జనులు ఉజ్జయినీ పురపతిని…!!నిప్పు!!
కల్లోలమెరుగని కడలిలా కరుణామయుని కనగనాలి..
ఉద్వేగమెరుగని ఉప్పెనై శంకరుడు కనికరించాలి…
ఆటుపోట్లెరుగని అలలలా…
అవనిపై మేము కన్న కలలలా…
కరుణవీక్షణములతో కార్తికేయుని జనకుడు సాక్షాత్కరించాలి…
కోటి కార్తీక పున్నముల వెలుగులై కమనీయ రూపమును దాల్చి
కనువిందు చేయాలి…!!నిప్పు!!
ఉద్విగ్న భావనలు తోడై గుండెలో ఉత్పన్నమౌ స్తోత్రాలతో ప్రార్ధించాలి మేము…
నిర్విఘ్నముగ స్మరియించుతూ కొండంత భక్తితో కడవరకు పూజించాలి మేము…
శలవియ్యవమ్మా..శాంకరీ శివునికి…
విన్నవించవమ్మా మా వినతిని…పరమేశ్వరునికి..
పాహిమామ్…పాహిమామ్..పార్వతీ
రక్షమామ్…రక్షమామ్..గిరిజాపతీ వరదేవ అభయంకరా… రక్షమాం..