ఓం నమః శివాయ నమః
శంకరా.. వింటివా ఒక పువ్వు అంది..
శివ పాద పూజలో భాగమవ్వు భాగ్యమింకనూ రాలేదు నాకని..
ఈశ్వరా..ఇది కంటివా…ఒక ఫలము కార్చే…
నిటలాక్షునికి నైవేద్యముగ కాకపోతినను కంట తడిని…
ఆ పువ్వు నేననుకొనుమురా…
ఆ ఫలము నా మనసను కొనుమురా…
శంకరా…శివ శంకరా…ఇది ఎన్ని జన్మల ఋణమురా…!!శంకరా!!
కరుణించు క్షణమిక ఎప్పుడని రోదించుచున్నది మానసం…
దయను చూపే ఘడియ కోసం వేచి వున్నది జీవితం…
నన్ను నేను నిముష నిముషమూ ఎంతకని ఓదార్చుకోను…
నీవు గాక ఎవరు నాకని ఎన్ని విధముల తెలుపను…!!శంకరా!!
తండ్రి లాగా తుడవరా నా కంట తడిని ఈశ్వరా…
నేనుంటిగా ఇక బెంగ దేనికని భుజము తడమరా శంకరా…
చాలునయ్యా ఆ ఒక్కమాట కలనైనా చెప్పినా….
మరువనయ్యా ఏ ఒక్కపూటా సేవించ నిన్ను కరుణ వదనా…!!శంకరా!!
పాహిమాం…..పాహిమాం..పరమేశ్వరా పాహిమాం….
రక్షమాం..రక్షమాం…సర్వేశ్వరా రక్షమాం..