ఓమ్ నమ:శ్శివాయ నమ:


ముకుళిత హస్తములతో నిను వేడ నీ ఎదుట నిలిచాము…
అరమోడ్పు కనులతో అర్థించ నీ చెంతకొచ్చాము…
శాసించరా శంకరా..మాలోని దుర్గుణములను నీ కంటి చూపుతో…
అభిశంసించరా హర హరా కనలేని మా అహమును నీ ఉగ్రరూపముతో…
ఆత్మ పరిశుద్ధము చేసి మమ్మాదుకోవయ్య…
సత్యసంకల్పముల నెరిగి మనగలనీ శివయ్యా….!! ముకుళిత!!
గుడిలోన లింగరూపమై నువ్వు వెలసివున్నా…
కనుమూసి ధ్యానించు సమయాన సాక్షాత్కరిస్తావు సంపూర్ణరూపాన..
పేరుకే నువ్వు నిరాకారుడివి త్రినయనా…
ఏ రూపమైననేమి సృష్టి స్థితి లయకారుడివి నువ్వే కదా ఈ జగాన.. !!ముకుళిత!!
నిత్య పూజలతో నిటలాక్ష నిను గాంచగా…
పరమపావనమవును ఈ జన్మ తదేకముగ పరికించగా..
కాత్యాయనీ పతి కరుణించినట్లు…
కైలాస శిఖరాల అంచునున్నట్లు..
తేలిపోతోందయా శివా నీ మాయలో ఈ తనువు…
కానివ్వరా శివా.. నను కూడ నీ పాద ధూళిలో ఒక రేణువు..
పాహిమామ్..పాహిమామ్..శివశంకరా..
రక్షమామ్..రక్షమామ్..అభయంకరా రక్షమామ్…