అలరారెనయా శంకరా..నీ నుదుటిపై ఆదిత్య రూపము..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

అలరారెనయా శంకరా..నీ నుదుటిపై ఆదిత్య రూపము..
వెలుగులు విరజిమ్మెనయా దేదీప్యమానముగా నీ దివ్యరూపము…
దర్శనంబిచ్చు ఆ మంగళకర నీదు సౌందర్యము..
ముగ్దమనోహరమయా కనిపించగా నీ కళ్ళలో ప్రేమ ఔదార్యము…!!అలరారె!!

నిత్యమూ మా ఇంట నిన్నెంత తలచుచున్నా..
నీ గుడికి వచ్చి నిను కొలుచుకుంటే మనసు ఎంత ప్రశాంతమో శివన్న…
అను నిత్యమూ ఎంత మా తలపులలో నీవున్నా….
నీ ముందు నిలిచి చేతులు జోడించి అభిషేకములు చేయిస్తూ చూస్తుంటే  జన్మధన్యమన్నా..
అనిపించునపడు మా మదికి నీ గర్భగుడి మా కలల కైలాసమై…
మము పిలిపించుకొన వెలిశె ఇలలోన నీదు స్థిరనివాసమై….!!అలరారె!!

తండోపతండాలుగా భక్తజనులు గుంపులై తరలొచ్చినా….
షోడసోపచారములు ఏ మాత్రమూ చేయకున్నా…
కనిపించవేవి కోపతాపాలు నీ మోములో చంద్రనయనా…
లెక్కించవేవి పాపపుణ్యాలు  శిక్షింప  మమ్ము ఒక్క క్షణమునైనా…
అలుపన్నదే లేక అభయమిస్తూనే ఉంటావు…
విసుగన్నదే లేక  చిరునవ్వుతో దీవించి పంపుతూనే ఉంటావు..!!అలరారె!!

పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా..పాహిమాం..
నీ దయ వున్న ఇళ్ళన్ని నీ గుడులేనయా రక్షమాం..

Leave a Comment

Scroll to Top