ఆనంద నందినీ… శివ కామినీ…

ఆనంద నందినీ… శివ కామినీ…
అనురాగరూపిణీ…లోక సంచారిణీ…
కరుణించు నీ కనులు పూజ్యనీయం…
చిరునగవు చిందించు నీ మోము శ్లాఘనీయం…
హే మాతా…పాలించవే భక్తులను పరిపాలికా…
మా తల్లీ… దీవించవే దీనులను మూకాంబికా…!! ఆనంద!!

ఎనలేని సౌందర్యంతో వెలుగులీనేవు…
సృష్టి నలుమూలలా నీ కరుణ వ్యాప్తి చేసేవు…
అనుకోని ఆపదలు ఎన్నొచ్చినా…
క్షణము లో దాటేను మాతల్లి నిను తలచినా…
కలగన్న కోరికలు ఎన్నివున్నా…
కన్నతల్లివై తీర్చేవు నిను కొలిచిన ..!! ఆనంద!!

నీ ప్రేమమూర్తికి వామ భాగమై వుందువే…
మా కరుణామయునికి కంటి పాపవై వుందువే…
ఏలవే మాతల్లి ముల్లోకములను…
నడిపించవే సృష్ఠి రథ చక్రములను…
ముక్కోటి దేవతలు నీవెంట రాగా ..
కరుణించవా మాతల్లి నీ జే గంట మ్రోగ…!! ఆనంద!!

పాహిమాం..పాహిమాం… పరమేశ్వరి…పాహిమాం..
రక్ష మాం…రక్ష మాం…సర్వేశ్వరీ రక్ష మాం…

Leave a Comment

Scroll to Top