ఎందుకయ్యా శంకరా…
ఆ కపాల మాలల దండలు..
నీకేందుకయ్యా ఈశ్వరా…
ఆ భస్మలేపన పూతలు…
ఇవ్వనుంటిమి అందుకో పుబాల మాలల దండలు…
అందివ్వనుంటిమి పుచ్చుకో సుగంధ భరితపు చందనాలు…!!ఎందు!!
పట్టదాయే సోకు నీకు…
గిట్టదాయే తళుకు నీకు…
నచ్చదాయే పట్టు వస్త్రం…
మెచ్చవాయే పసిడి హారం…
శూల మొకటి చేత బట్టి ఏందిరా నీ వేషము…
ఒక బిచ్చమెత్తే పాత్రతోటి ఎచటికో ఆ పయనము…!!ఎందు!!
కాయుచుంటివి కాపలా…
శ్మశాన వాకిట లోపల…
ప్రతి జన్మ ముగిసిన దరిమిలా…
ఓదార్చుతుంటివి హితునిలా…
ఏడ్వనిచ్చి నవ్వనిచ్చి ముగియనిస్తవు జీవితం…
మాకొక పుటక నిచ్చి గిటకనిచ్చి ఆడుతుంటివి నాటకం…!!ఎందు!!
పాహి పాహి శంకరా పరమేశ్వరా శివ పాహిమాం…రక్ష రక్ష హర హరా..హే రక్ష శివ రక్ష మాం…