తెరవకయా శివా…నీ ముక్కన్నుని..

తెరవకయా శివా…నీ ముక్కన్నుని..
తెరిచితే తట్టుకోగలమా చూసి ఆ బడబాగ్నిని…
భస్మీపటలమయ్యేము కరుణించకుంటే…
కాలగర్భమున కలిసేము నీవు దీవించకుంటే….
ఈశ్వరా… అల్పులము మన్నించి ఆదుకొనరా…
పరమేశ్వరా…ఈ దీనులను గుండెలకు హత్తుకొనరా…!!తెర!!

పాప పంకిలమైనవి మా మనసులు….
లోపభూయిష్టమైనవి మా నడతలు…
ఇంద్రియ నిగ్రహము లేని మా జన్మకు….
నీవు ఎన్ని వరములనిస్తేనేమి మా బ్రతుకుకూ…
భక్తి మార్గము మరచి బ్రతుకుతున్నాము…..
ముక్తి విలువలు తెలియక మసలుచున్నాము….!!తెర!!

శంకరా…మీద పడుతున్నది వయసు జోరుమీద..
అభయంకరా…ధ్యాస పడకున్నది ఇంకనూ నీ రూపు మీద…
మళ్ళించవా మా మనసు నీ రూపు వైపు…
నడిపించవా మమ్మింక నీ ఆలయము వైపు….
గర్భగుడిలో నీకు జ్యోతులై వెలిగేము….
కాల క్రమేణ నీలోన ఐక్యమైపోతాము…
మన్నించి మాకివ్వు ఈ ఒక్క వరము….
ఏ అష్టైశ్వర్యములు మేము నిన్నింక అడగము….!!తెర!!

పాహిమాం…పాహిమాం… పార్వతీశా పాహిమాం…రక్షమాం…రక్షమాం..ఉమా మహేశా రక్ష మాం…

Leave a Comment

Scroll to Top