భవహరా…భయానక భీకర రూపమును  భరించలేమయా..

ఓమ్ నమ:శ్శివాయ నమ:🙏🙏🙏

భవహరా…భయానక భీకర రూపమును  భరించలేమయా..
హర హరా…నువ్విలా దర్శనంబియ్య ముదావహము కాదయా…
పరమేశ్వరా… పగ పట్టినట్లు చూడ పాడి కాదయా…
సర్వేశ్వరా… చిరాకు పడక చిరునగవు కనులతో సాక్షత్కరించరా…!!భవ!!

మీటిచూడు మా హృదయ వీణని…
పలికించునవి…నీ నామ సరిగమలని…
తాకి చూడు మా గుండె గది తలుపులని…
వినిపించునవి నీ దివ్య మంత్రాలని…
నీ కొనగోటి పద రేణువంత కాము మేము…
నీ పగవారమెటులవుతమో చెప్పు మేము…
మన్నించరా శంకరా…మా మనవిని..
కరుణించరా హర హరా…మా మొర విని !!భవ!!

వద్దు వద్దురా వరదాయకా…వీక్షించలేము నీ ఉగ్ర రూపమును…
వానమబ్బులా కరగరా ఇక…
కురిపించు ఈ నేలపై  నీ ప్రేమ చినుకులను…
ఈ పుడమి పై పూయాలి భక్తి బీజాక్షర కుసుమాల పూదోటలు..
ఆర్తిగా కోసుకొని వచ్చి ఆ పూలతో పూజిస్తూ పాడాలి  మేము నీ పాటలు…

పాహిమాం..పాహిమాం..శివశంకరా పాహిమాం…
రక్షమాం…రక్షమాం..అభయంకరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top