ఓమ్ నమ:శ్శివాయ నమ:


కట్టిపడేయకు శంకరా…దివ్య సొగసులద్దుకొని మమ్మిలా…
చూచుచున్నది నీ నిజరూపమే ననుకొని మేము ఉట్టిపడేలా…
పెదవి దాటిన నవ్వుగా…
మా ఎదను తాకిన ప్రేమగా…
తనువులయ్యెను భక్తి మయమయ మోహాము…
నిన్నెన్ని సార్లు దర్శించినా తీరదాయెను దాహము…!!కట్టి!!
భువనమయ్యింది…నీ పీఠమై
గగనమయ్యింది…నీ ఛత్రమై
సురులు విరులై నీ మెడలోన మాలలయ్యారు…
నాల్గు దిక్కులు నాల్గు మూలలై నీ పట్టు వస్త్రమయ్యారు…
గ్రహరాశులన్నీ సుమ రాశులై…
నీ పద పూజ పుష్పాల ధన రాశులై..
చేరి పోయాయి నీ ముంగిట….
పొంగి పోయాయి నిను గాంచి నీలకంఠా…!!కట్టి!!
సురులైన నరులైన ఎవరైన.. పడక తప్పదు నీ మాయ లోన…
ఎంత కఠినమైన శిల అయిన శిల్పి చేతి స్పర్శతో అలవోకగా లింగమవదా ఈ జగాన…
సర్వజగతికి నువ్వు చేరువవునటుల సృష్టించావు ఎన్నెన్నో శిల సంపదలు ఇలలోన…
భక్తితో తలచుకొని శిలను శివలింగము గా మలచుకొని ప్రతిష్టించుకొమ్మని గుడిలోన…
ధైర్యమిచ్చేందుకు నేనున్నాను మీ చెంతనేనని….
దీనదయాళుని నేనుండగా చింత ఇక మీకేలనని…!!కట్టి!!
పాహిమాం..పాహిమాం..శివశంకరా పాహిమాం…
రక్షమాం..రక్షమాం..అభయంకరా రక్షమాం…