రక్షాబంధన వేళ రక్షకుడవై రావయ్య శివ శంకరా…

రక్షాబంధన వేళ రక్షకుడవై రావయ్య శివ శంకరా…
దుర్మార్గము పెల్లుబుకుతోంది దుష్ట శిక్షణ చేయరావయ్య పరమేశ్వరా…
చితికి పోతున్నారు లేత చిన్నారులు…
మానవ మృగాలకు బలి అవుతున్నారు స్త్రీ మూర్తులు…
ఆపకుంటే ఎట్లయ్య ఈ ఘోర కలిని…
ముక్కన్ను తెరిచైన ఆపరా ఈ క్రూర బలిని…
పాహిమాం పాహిమాం పరమేశ్వర…
పడతులను పరిరక్షించరా శివా జగదీశ్వర…!! ర!!

అన్నవై అరుదెంచి  ఆదుకొనరా..
కన్న తండ్రివై భావించి కాపాడరా…
వినిపించకున్నవా వారి ఆర్త నాదాలు….
శివా… కనిపించకున్నవా వారి కన్నీటి కథలు…
కదలి రాకుంటే ఎట్లయ్య కరుణాకరా…
కాపాడ రాకుంటే మా గతిఎట్ల శివశంకరా…!! ర!!

వేడుకొన సమయమని వినిపిస్తి వ్యధని…
నివేదించు తరుణమని పరచితిని మనసుని….
దీనబంధూ…. ప్రక్షాళనము చేయరావయ్య ఈ సమాజముని….
ఆత్మబంధూ…అతివలకు అన్ని నీవైపాలించు ఈ జగతిని…
శ్రావణ పౌర్ణమీ నాటి ఈ వినతిని…
దయతోడ స్వీకరిస్తే నీ చరణాలు శరణంటిని…!! ర!!

పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం… రక్షమాం రక్షమాం సర్వేశ్వరా రక్షమాం…

Leave a Comment

Scroll to Top