చాలయ్య శంకరా..చాలు చాలు…
ఈ ఒక జన్మ నాకింక చాలు చాలు…
వలదయ్య ఈశ్వరా.. వలదు వలదు…
మరుజన్మ నాకింక వలదు వలదు…
కనురెప్పవై కాచావు ఇన్నేళ్లుగా…
నా కనుచూపువై నడిపావు ఇన్నాళ్లుగా…!!చా!!
కష్టమన్నది తెలియక కాచినావు…
నాకిష్టమన్నవి సమకూర్చి పెట్టినావు…
చింత సంద్రాన నేను మునిగి ఉన్నపుడు…
చేయందించి కాచావు శివా అని పిలిచినపుడు…
దీనబంధూ… నీ దయకు అంతు లేదటగా…
ఆత్మబంధూ… ఆదుకొనుటలో నీ సాటి ఎవరు లేరటగా…!!చా!!
కోరాలనిపించదు నాకు ఏ కోర్కెలైననూ….
ఇక నిన్ను అడగాలనిపించదు ఏ వరములైననూ…
నీ దర్శనంబే మాకు ఒక వరము తండ్రి…
నీ వీక్షణంబే మా సకల సంపదలు తండ్రి…
ఈశ్వరా..నీ నుదుటి విభూదిలో నేనొక్కరేణువవని…
పరమేశ్వరా.. నీ పద నర్తనలకు చెలరేగు ధూళినన్నవని….!!చా!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…