ఓమ్ నమ:శ్శివాయ నమ:


ఏమున్నదయా నీ మోములో..
దైవమై పోయావు మా గుండె గుడిలో..
ఏమున్నదయా నీ చూపులో..
ప్రాణమై పోతావు ప్రతి తలపులో..
వరమిస్తే మళ్ళీ పుట్టేము ఈ పుడమిపై…
కరుణిస్తే సేవిస్తూ నిలిచిపోతాము ఈ నేలపై…!!ఏమున్న!!
నీలాకాశమే నీకు ఛత్రమై…
కైలాసమే నీకు పీఠమై…
సప్తలోకాలను సంరక్షింపగా…
అష్టదిక్పాలకులను పరిపాలించగా…
అందించినావయ్య సుపరిపాలనా సంపదను లోకానికి..
కలలు పండించినావయ్య పరిపాలనా ఫలితాలు అందించి మా జీవితాలకి..!!ఏమున్నదయా!!
మనసున్న మా మంచి మహరాజువై…
కరుణగగనాన ఉదయించు నెలరాజువై…
లెక్కలేనన్ని చుక్కలతో నీ పూజ చేయమా..
దిక్కు నీవేనంటూ నీ పాదాలు మొక్కమా…
సర్వాంగ సుందరమైన నీ రూపమును చూసి…
తరియించమా నీ ముందు సాష్టాంగ ప్రణామములు చేసి..!!ఏమున్నదయా!!
పాహిమామ్..పాహిమామ్..పరమేశ్వరా పాహిమాం..
రక్షమాం..రక్షమాం..సర్వేశ్వరా రక్షమాం..