కైలాస పురమందు కొలువుండు స్వామీ…
తల్లి పార్వతీ మదినందు నివసించు స్వామీ…
నిక్కముగ నిను కొలుచు ప్రతి భక్తుడు…
నీకు నైవేద్యములనుంచి కాని తానేమీ తినడు…
ఆరగించమని తాను నిను వేడుకొనును…
తనని ఆశీర్వదించమని శిరమొంచి మొక్కుకొనును…!!కై!!
భక్తితో తెస్తాడు భక్తుడు ఒక పూలమాల…
నీకు ప్రియమనుచు ఇస్తాడు రుద్రాక్ష మాల…
ఆర్తితో వస్తాడు నిన్ను తను కాన…
కురిపిస్తావనే ఆశతో దీవెనల వాన…
అడగాలనే వున్ననూ ఏ వరమైననూ…
తుదకు నిను దర్శించుటే వరమని వెనుతిరిగి పోవును…!! కై!!
ఈశ్వరా…ప్రతి ప్రాణిలో నిను చూచు వరమివ్వమనుచూ…
ఏ ప్రాణికీ హాని కలిగించని మనసు తనకిమ్మననుచూ…
నిస్వార్థ హృదయముతో కొలుచు కొనుభక్తుడు….
నిజ భక్తి కనబరచి వేడుకొను దీనుడు…
ఆత్మ సాక్షిగా కొలుచు జనుల దీవించు శంకరా…
ఆత్మ సంతృప్తిగా ధ్యానించు భక్తులను కరుణించు ఈశ్వరా…!! కై!!
పాహిమాం…పాహిమాం…పరమేశ్వరా పాహిమాం…రక్ష మాం..రక్ష మాం..సర్వేశ్వరా రక్ష మాం…