వెళ్ళిరా వెళ్ళిరా గణపతి…

వెళ్ళిరా వెళ్ళిరా గణపతి…
తిరిగి మళ్ళిరా మళ్లిరా గణపతి…
చేసినాము నిమజ్జనం నిండు మనసుతో…
సాగ నంపినాము ఆ దివికి చెమ్మ కనులతో…
గణేశా గణేశా వందనాలురా…
నీ నవరాత్రుల జోరు తల్లి కెళ్ళి చెప్పరా…!!వెళ్ళిరా!!

పూజలందుకొంటినని శంభుని తో చెప్పు…
తీపి కుడుములందుకొంటినని కొమరయ్యతో చెప్పు…
పాలవెల్లి కట్టిరని పార్వతితో చెప్పు…
భక్తి పాటలు పాడారని ప్రమద గణములతో చెప్పు…
పంచుకో గణేశా అవని అనుభూతుల నిధులని…
దాచుంచుకో గణేశా…మళ్ళీ చవితి దాక వాటిని…!!వెళ్ళిరా!!

గంగలోన కలుపుతుంటే గుండె భారమాయెరా..
ఆ బెంగ తోటే ఇంటికి తిరిగొచ్చినామురా….
సాలుకొక్కసారి వచ్చి పలకరింతువు…
వచ్చి పూజలందుకొని తిరిగి వెళ్ళి పోతువు…
మరచి పోక రావయ్యా మళ్ళీ చవితికి…
మేము వేచి వుందుమయ్య ఆ పండుగ రోజుకి…!!వెళ్ళిరా!!

శలవు శలవు గణేశా శంభో హర గణేశా…మా మనసులను లందు కలవు కలవు లంబోదర గణేశా…

Leave a Comment

Scroll to Top