పాడవే మనసా శంకరుని గీతం…
కొనియాడవే మనసా…ఈశ్వరుని చరితం…
సుందరేశుడు హర్షించు నీ స్వర పూజను…
శాంకరీశుడు వర్షించు వర జడివానను…
ఆపకే మనసా…ఈ యాగము…
ఆపితే మళ్ళి రాదు నీకిక ఈ యోగము…!!పా!!
కానవే శివుని కుతూహలము…
నీ గానాన్ని విన హరుని ఉత్సాహము….
చూడవే శంకరుని ఆరాటము…
నీవు పాడితే వినాలని వున్న తన చరితము…
నమ్మి కొలిచేటి భక్తులకు దాసుడవునట శివుడు…
కోరి పిలిచే దీనులకు తండ్రి తానవునట ఈశుడు…!!పా!!
ఆశపడును శంకరుడు అభిషేకములకు….
నీకు శ్వాస తానవును పలుక మంత్రాల కొరకు….
ఉబలాటపడును శివుడు తుమ్మి పువ్వులకు…
నీకు శక్తి తానవును పూజించ కడతేరు వరకు…
మనసా…ఎలుగెత్తి పాడవే శంకరుని గీతం…
ఢమరుకం వాయించి చెప్పవే ఈశ్వరుని చరితం!!పా!!
పాహిమాం పాహిమాం పరమేశ్వర పాహిమాం…. రక్షమాం రక్షమాం సర్వేశ్వర రక్షమాం…